ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కనీ పాపనీ ఇక్కడుంచారు
ఎక్కడున్నా గాని దిక్కువారే గదా
చిక్కులను విడదీసి దరిచేర్చలేరా /ముక్కోటి
ఆలి ఎడబాటెపుడు అనుభవించెడువాడు
అలివేలు మంగపతి అవనిలో ఒకడే
ఏడుకొండలవాడు ఎల్లవేళలయందు
దోగాడు బాలునికి తోడునీడవుతాడు /ముక్కోటి
నెల్లూరి సీమలో చల్లంగా శయంనించు
శ్రీ రంగ నాయకా ఆనంద దాయకా
తండ్రి మనసుకు శాంతి తనయునకు శరణం
దయచేయుమా నీవు క్షణము ఎడబాయకా /ముక్కోటి
ఎల్లలోకాలకు తల్లివై నీవుండ
పిల్లవానికి ఇక తల్లి ప్రేమా కొరత
బరువాయే బ్రతుకు చెఱువాయే కన్నీరు
కరుణించి కాపాడు మా కనకదుర్గా..
ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కటి పాపను ఇక్కడుంచారు
గోపన్నవలె వగచు ఆపన్నులను గాచి
బాధలను తీర్చేటి భద్రాద్రివాసా ....
నిన్ను నమ్మిన , కోర్కె నేరవేరునయ్యా
చిన్నారి బాలునకు శ్రీ రామ రక్షా
బాల ప్రహ్లాదుని లాలించి బ్రోచిన
నారసింహుని కన్నా వేరు దైవము లేడూ
అంతుతెలియగ రాని ఆవేదనలు కలిగే
చింతలను తొలగించు సింహచలేశా
మొండిచేతులవాడవెందుకైనావంటే
చేతికెముకయే లేని వాడవని చాటుటకే
నీ రధము కదిలితే శుభము నొసగూరేను
జీవపధమును మార్చు శ్రీ జగన్నాధా
No comments:
Post a Comment